మేడే.! కార్మికుల దినోత్సవం మనదేనా?



మే 1.. అంటే 'మేడే'. దీన్ని అంతర్జాతీయ కార్మిక దినోత్సవం అని కూడా పిలుస్తారు. అమెరికాలో మాత్రం ప్రస్తుతం దీన్ని 'లాయల్టీ డే'గా వ్యవహరిస్తున్నారు.


చాలా దేశాల్లో మే డేని సెలవు దినంగా పాటిస్తారు. ఈ కార్మిక దినోత్సవ ఆవిర్భావాన్ని ఏ ఒక్క దేశానికో, సంఘటనకో ముడిపెట్టలేం. కానీ 1886లో షికాగోలోని హే మార్కెట్‌లో జరిగిన కార్మికుల ప్రదర్శనే ఈ మేడే పుట్టుకకు పునాది వేసిందని చెబుతారు.మే 1.. అంటే 'మేడే'. దీన్ని అంతర్జాతీయ కార్మిక దినోత్సవం అని కూడా పిలుస్తారు. అమెరికాలో మాత్రం ప్రస్తుతం దీన్ని 'లాయల్టీ డే'గా వ్యవహరిస్తున్నారు.




కార్మికులకు ఎనిమిది గంటల పని విధానం గురించి నినదిస్తూ 1886, మే1న చాలామంది కార్మికులు పోరాటం చేపట్టారు. దానికి మద్దతుగా నాలుగు రోజుల తరవాత షికాగోలోని హే మార్కెట్‌లో చాలామంది ప్రదర్శన నిర్వహించారు. కానీ ఆ ప్రదర్శన ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో కొందరు కార్మికులు చనిపోయారు.

ఆ సంఘటన అనంతరం 1889 నుంచి 1890 వరకు అనేక దేశాల్లో కార్మికుల ఉద్యమాలూ, నిరసన ప్రదర్శనలూ చోటుచేసుకున్నాయి



1890, మే 1న బ్రిటన్‌లోని హైడ్ పార్క్‌లో చేపట్టిన ప్రదర్శనకు దాదాపు 3 లక్షల మంది కార్మికులు హాజరయ్యారు. రోజులో కేవలం 8 గంటలు మాత్రమే పనివేళలు ఉండాలన్నదే ఆ ప్రదర్శనలో పాల్గొన్న వారి ప్రధాన డిమాండ్.

ఆ పైన అనేక యూరోపియన్ దేశాల్లో ఇదే నినాదంతో ప్రదర్శనలు జరిగాయి. క్రమంగా షికాగోలో జరిగిన కార్మిక ప్రదర్శనలో చనిపోయిన వారికి గుర్తుగా మే 1ని కార్మిక దినోత్సవంగా జరుపుకోవాలన్న ఒప్పందం కూడా కుదిరింది.




ఆపై ప్రపంచవ్యాప్తంగా మే డే స్వరూపం మారుతూ వచ్చింది. అనేక దేశాల్లో ఆ రోజున పోరాటాలూ, నిరసన ప్రదర్శనలూ చేపట్టడం పరిపాటైంది.

1900 నుంచి 1920 వరకూ యూరప్‌లో ప్రభుత్వ, ధనిక వ్యాపారుల దోపిడీని ఎండగడుతూ సోషలిస్టు పార్టీల ఆధ్వర్యంలో మే1న నిరసన ప్రదర్శనలు జరిగేవి. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో మే డే నాడు యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలు చేపట్టేవారు.

తరవాతి దశకాల్లో మే 1ని నాజీల వ్యతిరేక దినోత్సవంగా జరిపేవారు. హిట్లర్ పాలనలో ఆ రోజుని జాతీయ కార్మికుల దినోత్సవంగానూ జరుపుకునేవారు. ఇటలీలో ముస్సోలిని, స్పెయిన్‌లో జనరల్ ఫ్రాంకోలు మే డే పైన అనేక ఆంక్షలను విధించారు.






రెండో ప్రపంచ యుద్ధం తరవాత యూరొపియన్ దేశాల్లో మే1ని సెలవు దినంగా పాటించడం మొదలుపెట్టారు. అనంతరం అనేక దేశాలు ఇదే బాటలో నడిచాయి. చాలా దేశాల్లో కార్మికులకు సంబంధించిన అనేక సంక్షేమ పథకాలు ఆ రోజునే అమల్లోకి రావడం మొదలయ్యాయి

అటు సంక్షేమ పథకాల అమలుతో పాటు నిరసన కార్యక్రమాలకూ మే 1 వేదికగా మారింది. వేర్వేరు దేశాల్లో పెట్టుబడిదారీ వ్యవస్థపై నిరసన ప్రదర్శనలు కూడా ఆ రోజునే మొదలయ్యాయి. అనేక ఇతర కార్మిక ఉద్యమాలూ మే డే నాడే ప్రాణం పోసుకున్నాయి.

భారత్‌లోని కొన్ని రాష్ట్రాల్లో మే డేని సెలవు దినంగా పాటిస్తారు. ట్రేడ్ యూనియన్లు ఇదే రోజున ధర్నాలతో పాటు ర్యాలీలు, ఇతర ప్రదర్శనలనూ చేపడతాయి. కార్మికుల పని వాతావరణంతో పాటు వేతనాలూ మెరుగవ్వాలన్నది చాలాకాలంగా లేబర్ యూనియన్ల ప్రధాన డిమాండ్‌గా మారింది.




యాంత్రికయుగం రాకముందు మనిషి గంటలకొద్దీ పనిచేసేవాడు. అదొక బానిస బతుకు. మనిషి తన విజ్ఞాన పరిశోధనల మూలంగా యంత్రాలను సృష్టించుకున్నాడు. యాంత్రిక యుగంలో క్యాపిటలిజం ఏవిధంగా పెరిగిందో అదే స్థాయిలో సామాజిక స్పృహ, చైతన్యం కూడా పెరిగాయి. అందువల్లనే పనిగంటల పోరాటం వచ్చింది. కానీ భారతదేశంలో చికాగో కంటే ముందే, కలకత్తాలో కార్మికులు నిర్ణీత పనిగంటల కోసం హౌరా రైల్వేస్టేషన్‌లో 1862లో సమ్మెచేశారు. అప్పటివరకు ఆ రైల్వే కార్మికులు 10 గంటలు పనిచేసేవారు. అప్పుడే బెంగాల్‌ పత్రికల్లో పాలకవర్గానికి చెందిన అధికారులు ఎన్ని గంటలు పనిచేస్తారో మేము కూడా అన్ని గంటలే పనిచేస్తామని డిమాండ్‌ చేశారు. కాగా, అది విస్తృత స్థాయిలో ప్రజా పోరుగా మారలేదు. కాబట్టి ఆ సంఘటన ఉద్యమ స్వరూపాన్ని అందుకోలేదు.




1923లో మొదటిసారి భారతదేశంలో ‘మే డే’ను పాటించడం జరిగింది. 1920లో ట్రేడ్‌ యూనియన్‌ ఏర్పడటం మూలంగా అప్పటినుంచే కార్మికవర్గంలో చైతన్యం పెరగడం మొదలైంది. అప్పటినుండి ‘మే డే’ను పాటించడం జరుగుతుంది. కానీ అసంఘటిత కార్మికవర్గం అన్ని రంగాల్లో వచ్చింది. 1985 తర్వాత చోటుచేసుకున్న ప్రైవేటైజేషన్‌, లిబరలైజేషన్‌, గ్లోబలైజేషన్‌ పరిణామాల వల్ల అసంఘటిత కార్మికవర్గాల కార్మిక చట్టాలు అమలుకు నోచుకోవడంలేదు.

ముఖ్యంగా, ఐ.టి.రంగంలో ఎంతోమంది ఆడపిల్లలు, యువకులు పనిచేస్తున్నారు. ఈనాడు మార్కెట్‌ శక్తులు ఎక్కడ శ్రమను దోచుకునే అవకాశం వుంటే అక్కడ కంపెనీలు పెడుతున్నారు. అమెరికాలో వున్న కంపెనీలు అక్కడ ప్రజాచైతన్యం ఉన్నది కాబట్టి కార్మిక చట్టాలు అమలుకానటువంటి ఇండియాలో కంపెనీలు పెడుతూ వాళ్ళచే 10,12 గంటలు పనిచేయిస్తున్నారు. మాదాపూర్‌లోని హైటెక్‌ సిటీలో విద్యావంతులైన యువత ఈనాడు శ్రమ దోపిడీకి బలవుతున్నది. రాత్రుళ్లు ఆడపిల్లలను భద్రతలేకుండా ఇళ్ళకు పంపించడం మూలంగా నేరాల సంఖ్య కూడా పెరుగుతున్నది.




పెట్టుబడిదారీ వ్యవస్థ వున్నంతవరకు శ్రమదోపిడీ, ఎక్కువ పనిచేయించుకోవడం సర్వసాధారణం. కార్మిక చట్టాలను ఐ.టి. రంగంలో కూడా అమలుకై పోరాటం ఈనాడు అత్యంత అవసరం. కార్మిక చట్టాలు అమలు చేయబోమని పాలకవర్గాలు బహుళజాతి కంపెనీలకు హామీలిస్తూ దేశంలోకి స్వాగతిస్తున్నాయి. అసంఘటితరంగంలో అయితే సరేసరి. ఇటీవల ప్రభుత్వం కాంట్రాక్టు, పార్ట్‌టైం ఉద్యోగుల పేరుతో ప్రవేశపెట్టిన ఔట్‌ – సోర్సింగ్‌లోను కార్మిక చట్టాల నియమాలు అమలులో లేవు.

ఉదాహరణకు : ఇంటర్మీడియట్‌ వ్యవస్థలో రెగ్యులర్‌ ఉద్యోగుల కన్నా కాంట్రాక్టు ఉద్యోగులే అధికమైనారు. అంతేకాకుండా ప్రభుత్వరంగంలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య కూడా క్రమంగా తగ్గిపోయింది. అందుకు నిదర్శనమే పై ఉదాహరణ.నిరుద్యోగాన్ని, బలహీనతలను ఆసరా చేసుకొని వాళ్ళచే 10,12 గంటలు పనిచేయిస్తున్నారు. ఇది విద్యా, వైద్య రంగాల్లో ప్రయివేటీకరణ పెరిగిన కొద్దీ సర్వీసు భద్రత తక్కువవుతుంది కాబట్టి శ్రమదోపిడీ కూడా పెరుగుతుంది. వెనుకటికి స్కూళ్ళు 10 నుండి 14గంటల వరకు పనిచేసేవి. పిల్లవాణ్ణి ఆరు గంటల కంటే ఎక్కువ చదివించకూడదని విద్యావేత్తలు, పరిశోధకులు చెబుతున్నా, సెమీ రెసిడెన్షియల్‌, రెసిడెన్షియల్‌ పేర పాఠశాలలు సర్వసాధారణమైపోయాయి. ఆ టీచర్స్‌ నోరు మెదపకుండా 12 గంటలు పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది.


ప్రపంచీకరణ వలన వంద సంవత్సరాల క్రితం సాధించిన కనీస డిమాండ్లు కూడా ఈనాడు అమలుకు నోచుకోవడంలేదు.1886లో ఆరంభమైన ఈ ఉద్యమం వందేళ్ళ పండగ జరుపుకుంది. ప్రపంచంలో ఎనిమిది గంటల పనికోసం చేసిన పోరాటం పెట్టుబడిదారీ వర్గం పతనానికి ఆరంభమవుతుందనుకున్నాం. కానీ మళ్ళీ మార్కెట్‌ శక్తులు పాత పరిస్థితులకు ప్రాణప్రతిష్ఠ చేస్తున్నాయి. ఆనాటి కార్మికవర్గ చైతన్యం మరోసారి వెల్లివిరుస్తుందని, ఈ మే డే నాడు కొత్త స్ఫూర్తిని రగిలిస్తుందని ఆశిద్దాం. ప్రపంచీకరణ, సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారులు, బహుళజాతి కంపెనీలు, మొదలైన పీడక వర్గాలు శ్రామిక దోపిడీకి, కార్మిక చట్టాల ఉల్లంఘనకు సంఘటితమవుతున్న ఈ తరుణంలోనే ప్రపంచ కార్మికవర్గం ఆ శక్తులను ప్రతిఘటించేందుకు ద్విగుణీకృత ఉత్సాహంతో పోరాడాలి. ప్రపంచ శాంతిని అసలు ఈ భూగోళాన్నే కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అందుకు కార్మిక శ్రేణులు ఏకం కావాల్సిన చారిత్రక సందర్భం కూడా ఇదే.


అయితే మొదటగా ఈ ఉద్యమం అమెరికాలోని ఫిలడెల్ఫియాలో పని గంటల తగ్గింపు‌ కోసం ప్రారంభమైంది. ఈ ఉద్యమాన్ని కార్మికులు ఉదృతం చేసి పరిశ్రమలను స్తంభింపచేసి కార్మిక ప్రభంజనాన్ని అదుపు చేయలేక 1837 లో రోజుకు 10 గంట‌ల‌ పనిదినాన్ని అమెరికా ప్రభుత్వం శాసనబద్దం చేసింది.















Devotional 








Comments

Popular Posts